బిగ్ బాస్ హౌస్‌లో 'చిన్నారి పెళ్లికూతురు' నటి!
on May 31, 2021
కరోనా పరిస్థితుల కారణంగా బిగ్ బాస్ షోకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల సీక్రెట్ గా షూటింగ్ జరిపిన మలయాళ బిగ్ బాస్ సెట్ కు తాళం వేశారు అధికారులు. అయితే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ షోను ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి మీడియాలో ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. కొద్ది నెలల క్రితమే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్ హిందీ 14 ముగిసింది. ఇప్పుడు సీజన్ 15 కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కంటెస్టెంట్ లుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ నేహా మర్దా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని మంచి ఆఫర్ ఇచ్చారని.. గత నాలుగేళ్లుగా తనను షో గురించి సంప్రదిస్తున్నారని .. కానీ కొన్ని కారణాల వలన వారి ఆఫర్ అంగీకరించలేదని చెప్పింది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌లో ఆమె వసంత్ మాజీ రెండో భార్యగా, నిరంజన్ భార్యగా నటించింది.
తాజాగా బిగ్ బాస్ 15 కోసం సంప్రదించిన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఒకే గదిలో జీవితం కొనసాగించలేనని అనుకునేదాన్నని.. కానీ ఇప్పుడు లాక్ డౌన్ జీవితం మినీ బిగ్ బాస్ లా ఉందంటూ కామెంట్ చేసింది నేహ. ఒకవేళ తను గనుక బిగ్ బాస్ షోకి వెళితే.. ట్రోఫీ తనే అందుకుంటాననే నమ్మకం ఉందని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లో ఈ బ్యూటీ ఎంటర్ అవ్వడం ఖాయం.